సిలువపై యేసు త్యాగం – మానవత్వాన్ని మేల్కొలిపిన మహా సందేశం

పయనిం సూర్యుడు 04-04-2026సామల రామకృష్ణ భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా సాగిన గుడ్ ఫ్రైడే సిలువ యాత్ర.! తెలంగాణం, నేలకొండపల్లి (ఏప్రిల్ 03): గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం నేలకొండపల్లి పట్టణంలోని ప్రధాన పురవీధులు భక్తి పరవశంతో మార్మోగాయి. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దుఃఖ ఘట్టాన్ని స్మరించుకుంటూ క్రైస్తవ విశ్వాసులు ఉపవాసాన్ని ఆచరిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో సిలువ యాత్ర నిర్వహించారు. ఉదయం 9.30 నిమిషములకు పాత బస్ స్టాండ్ వద్ద గల రోమన్ క్యాతళిక్ చర్చి నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం, వీధి వీధి తిరుగుతూ సాగిన సిలువ యాత్రతో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. యాత్రలో పాల్గొన్న క్రైస్తవుల చేతుల్లో సిలువలను మోసుకుంటూ, యేసుక్రీస్తు అనుభవించిన బాధలను స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. ప్రతి దశలో “ప్రభూ, మమ్ము క్షమించు” అంటూ వినిపించిన ప్రార్థనలతో వాతావరణం భావోద్వేగభరితంగా మారింది. ఈ సిలువ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ భక్తిని చాటుకున్నారు. సిలువ యాత్ర సాగిన మార్గమంతా స్థానికులు సిలువకు నీళ్లు ఆరబోస్తూ తమ భక్తి శ్రద్దలను చాటుకున్నారు. క్రీస్తు నేర్పిన ప్రేమ, క్షమ, సేవాభావం అందరు కలిగివుండాలి : ఫాదర్ స్మిలెన్ మారియో యేసు క్రీస్తు మానవాళి పాప విమోచన కోసం తన ప్రాణాలను సిలువపై అర్పించాడని ఫాదర్ స్మిలెన్ మారియో విశ్వాసులకు సందేశాన్ని అందించాడు. క్రీస్తు అనుభవించిన బాధలు, అవమానాలు అన్నీ ప్రేమతో సహించి చివరి శ్వాసవరకు క్షమాభావాన్ని చూపించాడని అలాంటి క్షమాబావాన్ని ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని బోదించారు. ఒక పక్క తనను చంపివేస్తున్నారని తెలిసి కూడా వారిని క్షమించుము తండ్రి అనే ఆయన సిలువపై పలికిన మాటలు అపారమైన దయకు నిదర్శనమని బావోద్వేగబరిత ప్రసంగం చేశారు. సిలువపై చేసిన ఈ త్యాగం మానవత్వానికి ప్రేమ, క్షమ, సేవ అనే మహత్తర విలువలను నేర్పించిందని వెల్లడించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ జోసెఫ్, బ్రదర్ మరియకుమార్, ఉపదేశకులు సూరేపల్లి జ్ఞానరత్నం, పుష్ప, థామస్, ప్రసాద్, పుల్లారావు, నాగేశ్వరావు, బాలరాజు, మాజీ వార్డు సభ్యులు పగిడికత్తుల రాంబాబు, ఎస్సి సెల్ జిల్లా కన్వీనర్ జంగం లక్ష్మీ నారాయణ, మాల మహానాడు నాయకులు జంగం ప్రసాద్, యూనిటీ ఆఫ్ మాల జిల్లా కార్యదర్శి అవుట మధు, విచారణ సంఘ పెద్ద సిద్దెల వెంకటరత్నం, లక్ష్మి, ప్రసాద్, యువతి యువకులు విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *