భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు.. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు : 04. మునుగోడు నియోజకవర్గంలోని చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు . ఏసుక్రీస్తు సిలువ త్యాగాన్ని స్మరిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు, నిరాహార దీక్షలు, శిలువ యాత్రలు నిర్వహించారు. చర్చిలలో క్రీస్తు ఏడు మాటలపై సందేశాలు, మానవాళికి ఆయన బోధనలను గుర్తుచేసుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు సిలువపై చేసిన మహత్యాగాన్ని స్మరించుకుంటూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజాము నుంచే క్రైస్తవులు చర్చిలకు తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కమ్మగూడెంలో గ్రామ పురవీధులలో సిలువ మార్గాన్ని నిర్వహిస్తూ యేసుక్రీస్తు ఎదుర్కొన్న శ్రమలను స్మరించుకున్నారు. భక్తులు ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. యేసు నామకరణ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఫాదర్ ప్రతాప్ రెడ్డి ప్రసంగిస్తూ యేసు ప్రభువు జీవితం మానవాళికి మార్గదర్శకమని పేర్కొన్నారు.ప్రేమ, కరుణ,క్షమ,సహనం, త్యాగం వంటి మహత్తర విలువలను యేసు తన జీవితం ద్వారా ప్రపంచానికి బోధించారని తెలిపారు. శత్రువులను కూడా ప్రేమించాలి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *