
పయనించే సూర్యుడు అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ఏప్రిల్ 06 భారత మాజీ ఉప ప్రధాని, ‘భారత రత్న’ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఆదివారం అనపర్తి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి మండలం, ఎన్ టి ఆర్ కాలనీ కరివేపాకు పేట వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి కూటమి నాయకులు మరియు కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. ఘనంగా నివాళులు: అనపర్తి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్ ఆర్పి స్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశాభివృద్ధిలో ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన పడిన శ్రమను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వక్తల ప్రసంగం: కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. “దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని” పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల కూటమి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఎమ్ ఆర్ పి ఎస్ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.