రిమ్స్‌లోనే దస్తగిరి హత్య..చట్టవ్యవస్థ పూర్తిగా విఫలం..

* రిమ్స్ మర్డర్ కేసును జిల్లా ఎస్పి ఛాలెంజ్ గా తీసుకోవాలి. * దస్తగిరి హత్య నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి.. * గంజాయి బ్యాచ్ లపై పోలీసు యంత్రాంగం ఉక్కు పాదం మోపాలి. * సిపిఐ నగర కార్యదర్శి యన్. వెంకట శివ

పయనించే సూర్యుడు న్యూస్ : కడప ఏప్రిల్:7 నిండు ప్రాణాలు పోసే రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోనే నిండు ప్రాణాలు తీయడం అత్యంత దారుణ అమానుష ఘటననీ, ప్రాణాలను కాపాడే ఆసుపత్రి హత్యల కేంద్రంగా మారడం రాష్ట్ర చట్టవ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమనీ, చికిత్స కోసం వచ్చిన బాధితుడిని ఆసుపత్రిలోనే వేటాడి హత్య చేయడం నేరగాళ్లకు భయం లేకపోవడాన్ని స్పష్టం చేస్తోందనీ,రిమ్స్ వంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోందనీ సిపిఐ నగర కార్యదర్శి యన్ వెంకట శివ పేర్కొన్నారు. సోమవారం రిమ్స్ మార్చురీ వద్ద సిపిఐ నగర నాయకులు వెంకట శివ, మల్లికార్జున,బ్రహ్మం, భాగ్యలక్ష్మి, నారాయణ, నాగరాజు, నరసింహ రావు లు పేగులు బయటకు వచ్చి కత్తి పోట్ల దస్తగిరి మృతదేహాన్ని పరిశీలించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జరిగిన ఘటనపై అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ ఆలంఖాన్ పల్లె లో గత రెండు రోజులుగా పిల్లలు కొట్లాటలు పెద్దల మర్డర్ వరకు దారి తీయడం దారుణమన్నారు. కడప నగరంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణంలో కాపు కాసి తెల్లవారుజామున జరిగిన దస్తగిరి హత్య ఘటన చట్టవ్యవస్థ పూర్తిగా పతనమైందనే విషయాన్ని బహిర్గతం చేసినట్లు ఉందన్నారు. ప్రజలు ప్రాణరక్షణ కోసం వచ్చే ఆసుపత్రిలోనే ఒక వ్యక్తిని వేటాడి హత్య చేయడం అనేది నేరగాళ్లకు ఎంత ధైర్యం పెరిగిందో స్పష్టంగా చూపిస్తోందన్నారు. ఆలంఖాన్ పల్లెలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వారి ఇంటి వద్దనే దుండగుల మూకుమ్మడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ దస్తగిరి, వారు కుటుంబ సభ్యులు చికిత్స కోసం రిమ్స్‌కు చేరుకున్నారన్నారు. రిమ్స్ లో ఎక్స్రేరే తీయించుకొని తిరిగి ఐపి ఎమర్జెన్సీ వద్దకు వస్తున్న దస్తగిరి , వారి తమ్ముడు పై గంజాయి ముఠాకు చెందిన ఇదే దుండగులు రిమ్స్ లోనే మాటు వేసి తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిర్భయంగా దస్తగిరిని లక్ష్యంగా చేసుకుని పేగులు బయటకు వచ్చేటట్లు కత్తి పోట్లతో క్రూరంగా హత్య చేయడం అత్యంత దారుణం, అమానుషమన్నారు. ఇది సాధారణ హత్య కాదనీ పోలీస్ వైఫల్యానికి ప్రతీక అని వారు విమర్శించారు. రాత్రి దస్తగిరి ఇంటి వద్ద జరిగిన దాడి ఘటన పై తాలూకా పోలీసులకు సిఐ ఎస్ఐ లకు స్పష్టమైన సమాచారం ఉన్న ఎక్కడికక్కడ కట్టడి చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ఉందన్నారు. కడప నగరంలో గంజాయి ముఠాలు విస్తరిస్తున్నాయని ప్రజలు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా, పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు ఆసుపత్రి ఆవరణంలోనే హత్య జరగడం పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. జిల్లా ఎస్పీకి ఈ కేసును చాలెంజింగ్‌గా తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనీ,
ఈ ఘటన వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు, సహాయకులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలనీ గంజాయి ముఠాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పూర్తిగా అణిచివేయాలనీ డిమాండ్ చేశారు.రిమ్స్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చట్టవ్యవస్థను పూర్తిగా విస్మరించిందనీ నేరగాళ్లకు భయం లేకుండా పోయిందనీ,ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిన ఈ పరిస్థితి అత్యంత ఆందోళనకరమనీ వారు పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణంలో జరిగిన ఈ మర్డర్ భద్రతా వైఫల్యాలపై తగు చర్యలు చేపట్టాలన్నారు. బాధిత దస్తగిరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. దస్తగిరి హత్య కేసులో నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలనీ గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలనీ వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *