తెలంగాణ ప్రజలకు అలెర్ట్..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్..రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎండల ప్రభావం ఉన్నా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో 41 డిగ్రీల మార్క్ ను దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా రికార్డు అయింది. హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతోపాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. అయితే, ఇదే సమయంలో వర్షాలు కూడా పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ అంచనా ప్రకారం.. తొలి రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ తరువాత రెండు రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్ లో ఒక పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. రైతులు రబీలో సాగుచేసిన పంటలు ప్రస్తుతం చేతికందే దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వరి, మొక్కజొన్న, మిరప తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కురిసన వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *