మున్సిపల్ కార్మికుల పోరాటం ఫలించింది

* సాకేత్ ప్రణామ్ అపార్ట్‌మెంట్‌లో విధుల్లోకి 18 మంది స్వీపర్లు * గేటు ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళన * దిగివచ్చిన అసోసియేషన్.. నర్సు అనుషాకు కూడా విముక్తి

పయనించే సూర్యడు / ఏప్రిల్ 08/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కాప్రా మండలం సాకేత్ కాలనీలోని ‘సాకేత్ ప్రణామ్’ అపార్ట్‌మెంట్‌లో అకారణంగా తొలగించబడిన 18 మంది మహిళా స్వీపర్ల పోరాటం ఫలించింది. కార్మికుల ఐక్యమత్యం, యూనియన్ల మద్దతుతో అసోసియేషన్ నాయకులు దిగివచ్చి వారిని బేషరతుగా విధుల్లోకి తీసుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 6) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 18 మంది మహిళా కార్మికులను విధుల్లోంచి తొలగించడంతో వివాదం మొదలైంది. దీనిని నిరసిస్తూ మంగళవారం ఉదయం 9:30 గంటల నుంచే టీయూసీఐ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు అపార్ట్‌మెంట్ మెయిన్ గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు, పాత అసోసియేషన్ సభ్యులు జోక్యం చేసుకున్నారు. ప్రస్తుత అసోసియేషన్ అధ్యక్షుడు పి. కృష్ణమూర్తి కార్మికులతో చర్చలు జరిపి, అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలాగే ఏప్రిల్ 1న తొలగించబడిన నర్సు అనుషాను కూడా నేటి నుంచే విధుల్లోకి చేర్చుకున్నారు. కార్మికుల పట్ల అసభ్య పదజాలంతో దూషణలకు దిగుతున్న అసోసియేషన్ కార్యదర్శి జి. శశికుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, జాతీయ సెలవులు మరియు గుర్తింపు కార్డులు ఇవ్వాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు వి. ప్రవీణ్, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు గడ్డం సదానందం, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప, జిల్లా అధ్యక్షురాలు బి. లక్ష్మీబాయి, ఐఎఫ్టీయూ నాయకులు శివప్రసాద్, గడ్డం కృష్ణ మరియు కార్మికులు జయమ్మ, లక్ష్మి, తులసి, చంద్రకళ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *