పందిళ్ళపల్లిలో ఎస్బీఐ బ్రాంచ్ ప్రారంభం

* సేవలను సద్వినియోగం చేసుకోవాలి: రీజనల్ మేనేజర్ రాజశేఖర్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నూతన బ్రాంచ్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలు బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో పొదుపు ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో పొదుపు చేయాలని చెప్పారు. అవసరాల సమయంలో ఆ పొదుపు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా రుణాలు తీసుకుని, వాటిని సకాలంలో చెల్లిస్తే బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో పందిళ్ళపల్లిలో ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బ్రాంచ్ ఏర్పాటుకు లింగం రాంబాబు చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా పందిళ్ళపల్లి మాత్రమే కాకుండా బొప్పారం, గాంధీనగర్, అనంతసాగర్, మత్తేపల్లి, రామకృష్ణాపురం గ్రామాల ప్రజలు కూడా లాభపడాలని ఆకాంక్షించారు. ప్రజల ఆర్థిక అవసరాల కోసం ఎస్బీఐ అనేక వినూత్న పథకాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆనం ప్రభాకర్ రెడ్డి, బ్యాంకు మేనేజర్ నిషార్, చీఫ్ మేనేజర్లు ఫయాద్, రాంబ్రహ్మం, శ్రీలక్ష్మి, క్యాషియర్ హఫీజ్ భాష, చింతకాని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగం రాంబాబు, గాంధీనగర్ సర్పంచ్ ఓర్సు వీరభద్రం, బొప్పారం సర్పంచ్ ఎస్.కె రహమతుల్లా, వివిధ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *