పయనించే సూర్యుడు / ఏప్రిల్ 16 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అవినీతి దందా మరోసారి బట్టబయలైంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ నుసుం సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది, ప్రజల సేవ కోసం ఉన్న అధికారులే ఇలా అవినీతి మార్గం ఎంచుకోవడం ప్రజల్లో ఆగ్రహం రగిలిస్తోంది వర్షపు నీటి కాలువ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (ఎంబీ) నమోదు చేసి తుది బిల్లును ప్రాసెస్ చేయడానికి నిందితుడు కాంట్రాక్టర్‌ను తీవ్రంగా ఒత్తిడి చేశాడు. పని పూర్తి అయినప్పటికీ, బిల్లులు క్లియర్ చేయాలంటే తప్పనిసరిగా రూ.50,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం, అధికార దుర్వినియోగానికి ఇది తార్కాణంగా నిలిచింది, వేధింపులకు గురైన కాంట్రాక్టర్ చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్నారు. బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద నిందితుడు లంచం స్వీకరిస్తుండగానే అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. అరెస్ట్ చేసిన నిందితుడిని కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచారు. లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ స్పష్టంగా సూచించింది. ఇలాంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.