పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 యడ్లపాడు మండల ప్రతినిధి.. గత ఐదేళ్లలో రాష్ట్రంపై భారీ అప్పులు చేసి, ప్రజలపై పన్నుల భారం మోపిన వారు నేడు కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విమర్శించడం హాస్యాస్పదమని యడ్లపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు కామినేని సాయిబాబు విమర్శించారు. బుధవారం యడ్లపాడు మండలంలోని జాలాది, ఉప్పరపాలెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని సాయిబాబు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపారు. వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. రాజకీయాలకు పనికిరాని అసమర్థుల విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మాత్రమే జవాబుదారిగా పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు..