పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 14 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుపేద కుటుంబం, తోడుగా ఉండాల్సిన తండ్రి అకాల మరణం.. చుట్టూ అలుముకున్న చీకట్లు. కానీ ఆ బాలిక గుండె నిండా ఏదైనా సాధించాలనే పట్టుదల, తనను చదివించేందుకు తల్లి పడుతున్న కష్టం కళ్లముందు కదలాడింది. అదే ఆమెను లక్ష్యం వైపు నడిపించింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో భద్రాచలం ఎంజేపీటీ ( ఎం జే పి టి) గురుకుల కళాశాల విద్యార్థిని, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి పావని శ్రీ అద్భుత ప్రతిభ కనబరిచింది. వివరాల్లోకి వెళ్తే అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన జుజ్జురి శ్రీనివాసరావు (లేటు), విజయ దంపతుల పెద్ద కుమార్తె పావని శ్రీ. తండ్రి మరణంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. అయినప్పటికీ, తన కుమార్తె చదువుకు పేదరికం అడ్డుకాకూడదని తల్లి విజయ కూలి పనులు చేస్తూ పావనిని చదివిస్తోంది. తల్లి కష్టాన్ని గుర్తించిన పావని, బైపీసీ ( బి .ఐ .పి .సి) ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గానూ 956 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తల్లి కష్టానికి ప్రతిఫలం నాన్న లేని లోటు ఉన్నా అమ్మ పడుతున్న శ్రమను చూసి ఎలాగైనా మంచి మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. గురుకుల కళాశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహం, అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే ఈ మార్కులు సాధించాను” అని పావని శ్రీ భావోద్వేగంతో తెలిపింది. తండ్రి లేకపోయినా, పేదరికాన్ని జయించి పావని సాధించిన ఈ విజయం అటు కళాశాల విద్యార్థులకు, ఇటు గ్రామస్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గ్రామ పెద్దలు మరియు కళాశాల సిబ్బంది పావని శ్రీని, ఆమె తల్లి విజయను ప్రత్యేకంగా అభినందించారు.