నన్నయలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు..

పయనించే సూర్యుడు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా క్యాంపస్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ప్రశాంతి శ్రీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రొఫెసర్ ప్రశాంతి శ్రీ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టి, సమానత్వం పై ఆయన చూపిన మార్గం నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన చేసిన కృషి, ప్రతి పౌరుని హక్కులను కాపాడేలా చేసిన విధానం దేశ అభివృద్ధికి బలమైన పునాది అని ఆమె పేర్కొన్నారు. సమాజంలో సమాన అవకాశాలు, న్యాయం, స్వేచ్ఛలను స్థాపించడంలో అంబేద్కర్ గారి ఆలోచనలు ఇప్పటికీ ప్రాముఖ్యతను కోల్పోలేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. పోచయ్య,వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎల్. మధు కుమార్, సూరి బాబు తదితరులు మాట్లాడుతూ, అంబేద్కర్ గారి జీవితం ప్రతి ఒక్కరికీ ప్రేరణ అని, విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావాలని ఆయన ఇచ్చిన సందేశాన్ని యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో విశ్వవిద్యాలయ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *