
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 (జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న) జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో శుక్రవారం ఉదయంపాడి పరిశ్రమ విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి
పాడి పరిశ్రమ అభివృద్ధికి కీలకమైన అడుగుగా విజయ డెయిరీ పాల ఉత్పత్తిదారుల సహకార భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కొత్తగా ప్రారంభమైన ఈ సహకార భవనం ద్వారా పాల సేకరణ, నిల్వ, పంపిణీ వంటి సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చి రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.తద్వారా రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా డెయిరీ ద్వారా మంచి ధరలు పొందే అవకాశముంటుందని, మహిళా సంఘాలు కూడా పాడి పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆర్థికంగా బలపడతాయని ఎమ్మెల్యే తెలిపారు
చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తూ, నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సహకార భవనం పాడి రైతుల అభివృద్ధికి కేంద్రంగా మారి, మరింత మంది రైతులను ఈ రంగంలోకి తీసుకురావడానికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దేవరుప్పుల గ్రామపంచాయతీ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రజాప్రతినిధులు, డెయిరీ సంఘ సభ్యులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవనం ప్రారంభంతో దేవరుప్పుల మండలంలో పాడి పరిశ్రమకు కొత్త ఊపు వచ్చి, రైతుల జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు