
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం జహీరాబాద్ మండలంలోని హుగ్గెలి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అరైవ్-అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, రూరల్ ఎస్‌ఐ కాశీనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజలు పాటించాల్సిన ముఖ్య నియమాలను వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు ఇది డ్రైవర్‌కే కాక ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఫోన్ మాట్లాడటం అత్యంత ప్రమాదకరమన్నారు. అనంతరం రోడ్డు నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని, ప్రమాద రహిత గ్రామం కోసం కృషి చేస్తామని అధికారుల సమక్షంలో హుగ్గెలి గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.