పయనించే సూర్యుడు ఏప్రిల్ 10 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్, గురువారం: వైద్య వృత్తి అనేది అత్యంత పవిత్రమైనదని, ప్రతి వైద్యుడు సమాజానికి సేవ చేయడాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలోని మోయినాబాద్ ప్రాంతంలో ఉన్న శ్రీ బాలాజీ డెంటల్ కళాశాలలో నిర్వహించిన యూజీ–2020, పీజీ–2022 గ్రాడ్యుయేషన్ సెరెమనీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టభద్రులైన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమ వైద్య విద్యను సద్వినియోగం చేసుకుని రోగుల పట్ల కరుణ, జాలి, దయ, సేవా భావంతో వ్యవహరించాలని సూచించారు. ప్రొఫెషనల్ ఎథిక్స్‌ను పాటించడం ద్వారా మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని, ఆరోగ్య రంగంలో సమానత్వాన్ని తీసుకురావడంలో యువ వైద్యుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కొనియాడిన ఎమ్మెల్యే, కళాశాల యాజమాన్యం విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో చేస్తున్న కృషిని ప్రశంసించారు.