పయనించే సూర్యుడు ఏప్రిల్ 12, (చింతకాయని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం, తిర్లాపురం గ్రామంలో పశువులను గాలికుంటు (ఫుట్ అండ్ మౌత్) వ్యాధి నుండి రక్షించేందుకు శనివారం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ పి.వి.సి నాగులవంచ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో ఒకటని, సమయానికి నివారణ చర్యలు తీసుకోకపోతే పశువులు, దూడలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.గ్రామంలో మూడు రోజుల పాటు టీకాల పంపిణీ చేపడుతున్నామని, పాడి రైతులు తప్పకుండా ఈ టీకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి పికోర్నా విరిడే వైరస్ వల్ల వస్తుందని, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుందని వివరించారు. అందువల్ల పశువులకు శుభ్రమైన ఆహారం, నీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అలాగే, పశువుల నోరు, కాళ్ల మధ్య వచ్చే పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రపరచి, బోరోగ్లిజరిన్ పేస్ట్ రాయాలని సూచించారు. అవసరమైతే పెన్సిలిన్ వంటి యాంటిబయోటిక్ మందులు ఇవ్వాలని, హోమియోపతి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకాలు వేయిస్తే గాలికుంటు వ్యాధి నివారించవచ్చని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి. శ్రీనివాస్, ఎల్.ఎస్.ఏ శిల్ప, ఓ.ఎస్ నాగమణి, ప్రభాకర్, గోపాలమిత్ర నాదెళ్ల శౌరి, భూషయ్య, హనుమంతరావు, సీతారాములు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.