పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 రాజేష్ దౌల్తాబాద్) రాయపోల్: ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస సూచించారు. సోమవారం రాయపోల్ మండల వ్యాప్తంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రతపై గ్రామ సభలు నిర్వహించారు. ఈ క్రమంలో వడ్డేపల్లి గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ పేరిట రోడ్డు భద్రత అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ మానస గ్రామ ప్రజలకు రోడ్డు భద్రతపై పలు కీలక సూచనలు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రాణాపాయాలను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమూల్యమైన ప్రాణాలను కోల్పోవద్దని హెచ్చరించారు. గ్రామంలో రోడ్డు భద్రతను మెరుగుపరచేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు మరియు గ్రామ యువతతో కలిసి ప్రత్యేకంగా ‘రోడ్డు భద్రత కమిటీ’ను ఏర్పాటు చేశారు. అలాగే గ్రామ సభకు హాజరైన ప్రజలందరితో రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సర్పంచ్ సహకారంతో గ్రామంలోని రోడ్డు గుంతలను పూడ్చివేసి, రాకపోకలను సులభతరం చేసే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్, ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, వార్డు సభ్యులు, అంగన్వాడి సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.