ఖానాపూర్‌లో బీజేపీ నేతల సమక్షంలో మున్సిపల్ చైర్మన్‌గా అంకం మౌనిక బాధ్యతల స్వీకరణ

ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 (నిర్మల్ జిల్లా) ఖానాపూర్, ఖానాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన మున్సిపల్ చైర్మన్‌గా అంకం మౌనిక బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని గజమాలతో సత్కరించారు. అనంతరం భారీ ర్యాలీగా పట్టణ వీధుల గుండా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని చైర్మన్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ అంకం మౌనిక మాట్లాడుతూ ఖానాపూర్‌ను ఒక ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడం తన లక్ష్యమని తెలిపారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందిస్తానని, ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ నాగేష్ మరియు నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వరెడ్డి మాట్లాడుతూ ఖానాపూర్ అభివృద్ధికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *