జహీరాబాద్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన పద్మశాలి సంఘం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని జహీరాబాద్ పద్మశాలి సంఘం ఘనంగా నివాళులర్పించింది. మంగళవారం స్థానిక ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ మాట్లాడుతూ.. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్ రాష్ట్రం మోవా గ్రామంలో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్, బాల్యంలో ఎదురైన కుల వివక్షను ధిక్కరించి ఉన్నత శిఖరాలను అధిరోహించారని పేర్కొన్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి అర్థశాస్త్రం, న్యాయశాస్త్రాల్లో పట్టాలు పొంది, దేశ రాజ్యాంగ నిర్మాణంలో అగ్రభాగాన నిలిచారని వివరించారు. దళితుల హక్కుల పరిరక్షణకై ‘మూక్ నాయక్’, ‘బహిష్కృత భారతి’ వంటి పత్రికలను నడిపారని, మహద్ సత్యాగ్రహం వంటి పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 1956లో బౌద్ధం స్వీకరించిన ఆయనకు, భారత ప్రభుత్వం 1990లో అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ సభ్యులు సోమ చంద్రశేఖర్, పగిడిమర్రి రాములు, శివరాం రమేశ్, కొండా శివరాజ్, దార మధు, గద్దె వెంకటేశం, ఎన్నం రఘు, చిల్వేరి రాంచందర్, పెగడ శ్రీనివాస్, సగ్గం నాగేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *