పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 మధిర ప్రతినిధి మధిర మండలం, ఇల్లూరు గ్రామం, ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల సమస్యలపై గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలలుగా వీధి లైట్లు పనిచేయకపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, హానికరమైన (పార్ధినియం) మొక్కలు తొలగించకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని గ్రామస్థులు విమర్శిస్తున్నారు. ఎస్సీ కాలనీలో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీధి లైట్లు మరమ్మతులు చేయడం, చెత్తను తొలగించడం, మురికి కాలువలను శుభ్రపరచడం వంటి చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం చూపుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.