రోడ్డు భద్రత అందరి బాధ్యత : ఎస్పీ శరత్ చంద్ర పవార్

* “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత పై ప్రత్యేక కార్యక్రమం . * చిన్న వయస్సులోనే రోడ్డు భద్రత నియమాలను తెలుసుకుని వాటిని ఖ‌చ్చితంగా పాటించాలి . * ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ , కారులో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరి . * క్లాక్ టవర్ సెంటర్‌లో రోడ్డు భద్రత పై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్ .

పయనించే సూర్యుడు న్యూస్ నీలగిరి ఏప్రిల్ 16 రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, నియమాలు పాటిస్తే ప్రాణాలు కాపాడవచ్చని న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రత్యేక కార్యక్రమం మూడో రోజు బుధ‌వారం పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో మౌంట్ ఫోర్ట్ స్కూల్ విద్యార్థుల‌కు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల, ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయస్సులోనే రోడ్డు భద్రత నియమాలను తెలుసుకుని వాటిని ఖ‌చ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలలో నల్లగొండ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న‌ట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చన్నారు. అలాగే విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగించడం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం స్కూల్‌కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకుని జాగ్రత్తగా దాటడం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ వినియోగించడం స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అనంత‌రం విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చే విధంగా మునుగోడు క్రాస్ రోడ్డులో హ్యూమన్ చైన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ‌న్‌ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఐ లు గోపాల్ రావు, సతీష్, ఇతర పోలీస్ అధికారులు, స్కూల్ ప్రిన్సిపాల్ బాల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *