ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు

సమానత్వ సమాజమే అంబేద్కర్ ఆశయం ఆత్మ జిల్లా అధ్యక్షులు కాటిపెల్లి గంగారెడ్డి...

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఏప్రిల్ 12 మామిడిపెల్లి లక్ష్మణ్ జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఇటీక్యాల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సీమలదారి సదాశివ్ అధ్యక్షతన ఉన్నత పాఠశాల ఆవరణలో ముందస్తు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా ఆత్మ అధ్యక్షులు కాటిపెల్లి గంగారెడ్డి, సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ నాగిరెడ్డి సాయిరెడ్డి, విడిసి చైర్మన్ అనుపురం లింబాద్రి గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక ఉద్యమం, ఒక ఆలోచన, ఒక సామాజిక విప్లవమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అమోఘమని, కుల వివక్ష, అంటరానితన నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. “విద్య నేర్చుకోండి, సంఘటితమవండి, పోరాడండి” అనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని తెలిపారు. అంబేద్కర్ నిజమైన దేశభక్తుడని, దేశ అభివృద్ధి ప్రజల విద్య, సమానత్వంపై ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మారని వివరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించిన మహనీయుడిగా అంబేద్కర్ నిలిచారని పేర్కొన్నారు. కులమత భేదాలు లేకుండా సమాన సమాజం ఏర్పడాలని ఆయన కలగన్నారు అన్నారు. అంటరానితనం అనే సామాజిక వ్యాధిని నిర్మూలించడంలో ఆయన పాత్ర అపారమని, సమాజంలో అందరూ సమానమే అన్న భావనను బలంగా స్థాపించారని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలని, వారు చూపిన మార్గంలో నడుస్తూ మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. విద్యతో పాటు విలువలు కూడా అలవరచుకోవాలని హితవు పలికారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు అంబేద్కర్ పై పాటలు పాడిన, ఉపన్యాసాలు ఇచ్చిన వారికి బహుమతుల ప్రదానం చేసారు. అందరికి స్విట్స్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిరాణి, ఆర్.యు.పి.పి జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, ఎద్దండి రమేష్, హన్మంతరావు, జియావుద్దీన్, ముజాహిద్, స్వర్ణలత, శ్రీలత, నీరజ, నాగలక్ష్మి, సమత, కవిత, లక్ష్మణ్, రాజం, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *