పయనించే సూర్యుడు12-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా :-భారతదేశ సామాజిక విప్లవ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జగిత్యాల జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, సీనియర్ నాయకులు నక్క సతీష్ ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజాన్ని నిర్మించేందుకు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు, మహిళలకు విద్యను అందించడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని నమ్మిన గొప్ప మహనీయుడు పూలే అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని, హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.