
పయనించే సూర్యుడు న్యూస్ : ఏప్రిల్ /14 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నేడు ఇల్లంతకుంట మండల కేంద్రంలో సర్పంచ్ ఎం.రాజు మరియు గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య గారు మరియు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, హాజరయ్యారు. గ్రామ సభలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ సమస్యలు, అధిక వేగంతో వాహనాలు నడపడం, హెల్మెట్ వినియోగం, పాఠశాల విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో భద్రత వంటి అంశాలను ప్రజలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య గారు మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా పాఠశాలల వద్ద మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నెమ్మదిగా వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, మాట్లాడుతూ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్లే పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. యువత ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకూడదని సూచించారు. రాత్రి వేళల్లో వాహనాలపై రిఫ్లెక్టర్ స్టిక్కర్లు ఏర్పాటు చేసుకోవాలని, ట్రాక్టర్లు మరియు ఇతర వాహనాలకు లైట్లు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సర్పంచ్ ఎం.రాజు మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. గ్రామంలో రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యంగా పాఠశాలల పరిసర ప్రాంతాల్లో వాహనాలను నెమ్మదిగా నడపాలని, యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.అలాగే గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు గ్రామ సభలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని, ప్రజలందరూ ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని సర్పంచ్ కోరారు. అనంతరం ఎస్సై సిరిసిల్ల అశోక్, రోడ్డు భద్రతపై గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సర్పంచ్ ఎం.రాజు మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, మరియు ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్, శాలువాతో సన్మానించారు. గ్రామంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుందని, ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగు నాగరాజ్ శర్మ, వార్డు రేగుల కార్తీక్, మామిడి సుశీల, మామిడి శ్రీనివాస్, చేరాల వంశీకృష్ణ, రాకం సుమన్, అంతటి శ్రీకాంత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ పెద్దలు మరియు మహిళా సంఘాల సభ్యులు, ఆశ వర్కర్లు,అంగన్వాడీ టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.