అంబేద్కర్ అందరివాడు : పూల భాస్కర్

పయనించే సూర్యుడు-15-04-2026-రాజంపేట న్యూస్ : రాజ్యాంగ పరిరక్షణ నేటి ప్రతి భారతీయుని కర్తవ్యం అని మాజీ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పూల భాస్కర్ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూల భాస్కర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్, భారతరత్న, మహా మేధావి అంబేడ్కర్ స్వయంకృషి, స్వీయ ప్రతిభతో ఆ స్థాయికి చేరుకున్నారన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన కృషి చేశారని, కులాంతర వివాహాలను ప్రోత్సహించారని, స్వయంగా తానే శారదా కబీర్ అనే బ్రాహ్మణ స్త్రీని రెండవ వివాహం చేసుకొని కులాంతర వివాహాలను ప్రోత్సహించాడని తెలిపారు. అంబేద్కర్ అందరివాడని, కానీ దురదృష్టవశాత్తు కొందరు పని కట్టుకొని ఆయనను కొందరి వాడిగా చిత్రీకరిస్తున్నారని, ఇది అంబేద్కర్ ప్రతిష్టను తగ్గించడమే అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, గణతంత్ర రాజ్యం, సర్వసత్తాక దేశం అనబడే ఐదు స్తంభాల మీద న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం అనబడే నాలుగు దూలాల మీద అంబేద్కర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ సౌధం నిర్మించబడిందన్నారు. ప్రతి భారతీయుడు భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం అంబేద్కర్ సాక్షిగా అంకితం, పునరంకితం కావలసిన సమయం ఆసన్నమైందని పూల భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూసుఫ్, రాజంపేట మండల అధ్యక్షుడు మహాదేవ, షఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *