
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 11 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” 100 రోజుల ప్రత్యేక కార్యాచరణపై శుక్రవారం అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ముమ్మర కసరత్తు జరిగింది. మండల అభివృద్ధి అధికారి మండ రామకృష్ణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సాగునీటి సంఘాల బాధ్యతలు, నిధుల వినియోగం మరియు పనుల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు.నాలుగు దశల్లో పనులు:ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై 15 వరకు కొనసాగుతుందని, ఈ సమయాన్ని నాలుగు దశలుగా విభజించి పనులను పర్యవేక్షిస్తామని ఎంపీడీవో వివరించారు. మొదటి 10 రోజుల్లో పనుల గుర్తింపు పూర్తి చేసి, తదుపరి దశల్లో నిధుల మంజూరు మరియు క్షేత్రస్థాయి అమలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా 70 రోజుల పాటు నిరంతరాయంగా చెరువుల పూడికతీత, ఫీడర్ ఛానళ్ల ప్రక్షాళన పనులు జరుగుతాయన్నారు.భూగర్భ జలాలే లక్ష్యం:మండలంలోని భూగర్భ జల మట్టాలను కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘జల్ శక్తి అభియాన్’ మరియు ‘ఉపాధి హామీ’ నిధులతో అనుసంధానం చేస్తూ ఈ పనులను పూర్తి చేస్తామన్నారు. పారదర్శకత కోసం ప్రతి పనిని మొబైల్ యాప్ ద్వారా ‘జియో ట్యాగింగ్’ చేయనున్నట్లు వెల్లడించారు.సమావేశం అనంతరం అనపర్తిలోని పలు చెరువులను అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల నాయకులు, ఇరిగేషన్ అధికారులు, ఎన్.ఆర్.జి.ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.