పయనించే సూర్యుడు ఏప్రిల్ 14, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలంలోని కుచెర్కల్ గ్రామ శివార్లలో ఉన్న మెసర్స్ వినాయక ప్యానెల్ ప్రోడక్ట్ పరిశ్రమ విడుదల చేస్తున్న దట్టమైన పొగతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గాలిలోకి వదులుతున్న ఈ నల్లటి పొగ కారణంగా కుచెర్కల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊపిరి తీసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషపూరితమైన పొగ వల్ల శ్వాసకోశ వ్యాధులు,కంటి సమస్యలు,చర్మ వ్యాధులతో పాటు పశుగ్రాసం కలుషితమై పశువుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గత కొంతకాలంగా ఈ కాలుష్యంపై గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నా పరిశ్రమ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని, ఫిల్టర్లు వాడకుండా నేరుగా పొగను గాలిలోకి వదులుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు గానీ, ప్రజా నాయకులు గానీ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.