పోలీసుల అత్యుత్సాహంపై జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్ర డీజీపీకి

ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 15 ​ కృష్ణవరం గ్రామంలో ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తూ, దేవుడిని కించపరిచిన ఎటపాక సిఐ మరియు ఎస్సైల తీరుపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మరియు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తెలిపారు. మంగళవారం ఎటపాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణవరం సర్వే నంబర్ 115లోని ప్రభుత్వ భూమిలో గ్రామస్తులు దేవుడిని ప్రతిష్ఠిస్తే, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు అతిగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ​ఎటపాక సిఐ కన్నప్ప రాజు, ఎస్సై అప్పలరాజు గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అత్యంత దారుణంగా బూతులు తిడుతూ, “దేవుడు లేడు.. గుడి లేదు.. విగ్రహాన్ని పీకి పారేయండి” అని బెదిరించడం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ, సామాన్య ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల వైఖరిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ​ఆదివాసీల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఈ విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు మరియు ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కుంజా శ్రీను హెచ్చరించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉండి ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవరం గ్రామస్తులు చిచ్చడి సూరిబాబు, చిచ్చటి రామారావు మల్లికార్జున్ సున్నం శ్రీను సాయం నరసింహారావు, నాగేష్ , ధర్మయ్య, గోపాలరావు మరియు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *