జమ్మికుంట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ పదవులు… ఎవరికీ వరం? ఎవరికీ వంచన?

అర్హతలు కఠినం… రాజకీయాలు కఠోరం… పారదర్శకతపై అనుమానాల మబ్బులు

పయనించే సూర్యుడు / ఏప్రిల్ 20 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకం మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. ప్రత్యేక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ కో-ఆప్షన్ పదవులు నిజంగా అర్హులకే దక్కుతాయా? లేక రాజకీయ ప్రాభవం, లాబీయింగ్, ఒత్తిళ్లకే పరిమితం అవుతాయా? అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. మున్సిపల్ నిబంధనల ప్రకారం కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు పలు అర్హతలు నిర్దేశించారు. మున్సిపల్ ఓటర్ జాబితాలో పేరు ఉండటం, కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే వార్డు మెంబర్ లేదా వైస్ ప్రెసిడెంట్ వంటి పదవుల్లో ఉన్నవారు ఈ అవకాశానికి అనర్హులు. అభ్యర్థులు మున్సిపల్ పరిధిలో కనీసం 5 సంవత్సరాలుగా నివసించి ఉండటమే కాకుండా, సామాజిక సేవలో అనుభవం కలిగి ఉండాలి. ఇంకా ముఖ్యంగా, సాంఘిక, సేవా, విద్యా, మత, క్రీడా, సాంస్కృతిక సంస్థలలో సభ్యత్వం ఉండటం కూడా ఒక కీలక అర్హతగా పేర్కొన్నారు. వార్డు స్థాయి సంస్థలతో అనుబంధం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ అర్హతలు కాగితం మీదే పరిమితం అవుతాయా? అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు, మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాకపోతే కో-ఆప్షన్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే నిబంధన కూడా ఉంది. ఇది బాధ్యతాయుతమైన పాత్రను సూచించినప్పటికీ, ఎంపికలో పారదర్శకత లేకపోతే ఈ నిబంధనల ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జమ్మికుంటలో గత ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం ప్రభావం కనిపించిందనే ఆరోపణలు ఇప్పటికీ ప్రజల్లో నిలిచే ఉన్నాయి. అదే తరహాలో కో-ఆప్షన్ ఎంపికలో కూడా రాజకీయ జోక్యం ఉంటుందా? లేక నిజంగా సేవా భావం ఉన్నవారికి అవకాశం దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజలు మాత్రం స్పష్టంగా ఒకటే కోరుతున్నారు—కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, న్యాయంగా జరగాలి. ప్రత్యేక వర్గాలకు నిజమైన ప్రాతినిధ్యం ఇవ్వాలంటే రాజకీయ ప్రభావం లేకుండా అర్హుల ఎంపిక జరగాల్సిందే. లేదంటే ఈ పదవులు కూడా కేవలం అధికార పార్టీలకు చెందిన వ్యక్తులకు మాత్రమే పరిమితం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మికుంటలో కో-ఆప్షన్ పదవులు నిజమైన సేవాదారులకు దక్కుతాయా? లేక రాజకీయ కూటములకే కేటాయిస్తారా? అన్నది త్వరలోనే స్పష్టమవుతుంది. కానీ ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవాలంటే అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం అత్యంత కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *